A Mother's Heart
- Mind and Personality Care

- Jan 10
- 1 min read
తల్లి మనసు
పిల్లల అల్లరి, ఆటల గోల,
ఇల్లంతా నవ్వుల వెలుగుల గొల।
అప్పట్లో హడావిడి, కోపాలు,
ఇప్పుడవి తీపి జ్ఞాపకాల జాలులు।
ఇప్పుడు ఇల్లు నిశ్శబ్ద మయం,
తల్లి గుండెల్లో శూన్య సంచారం।
పిల్లలు దూరమై వెళ్ళిపోతే,
ఆ జ్ఞాపకాలు దారి చూపుతాయి మళ్లీ।
తల్లి కోరేది ఒక్కటే,
పిల్లలు సుఖంగా ఉండాలి ఎల్లప్పుడే।
వాళ్ళ అల్లరిని ఆనందించండి,
ప్రేమతో మనసు నింపుకోండి।
తల్లితండ్రులకు పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు ఇల్లు హడావిడి, అల్లరి, కేకలు, నవ్వులతో నిండుగా ఉంటుంది. తల్లులు పిల్లల వస్తువులు సర్దడం, వారిని క్రమశిక్షణతో నడిపించడం, వారి అవసరాలు తీర్చడం వంటి పనులతో బిజీగా ఉంటారు. ఆ రోజుల్లో పిల్లల అల్లరిని చూసి విసుగొచ్చినా, ఆ హడావిడే జీవితం.
గత జ్ఞాపకాలు:
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి నిత్యజీవిత సమస్యలు, ఉదయాన్నే స్కూల్ బ్యాగ్, హోంవర్క్ బుక్స్ కోసం అరుపులు, స్కూల్ కి వెళ్ళే హడావిడి, ఆటల కోసం కొత్త వస్తువులు అడగడం వంటి సన్నివేశాలు ఇంటి లోపల జరిగే సంగీతంలా ఉండేవి. ఆ రోజులు చిన్న సమస్యలతోనూ, చిన్న సంతోషాలతోనూ నిండుగా ఉండేవి.
ఇప్పటి పరిస్థితి వేరు. పిల్లలు పెద్దవాళ్లు కావడం, వారి జీవితాలను ముందుకు నడిపించుకోవడం తల్లి కి గర్వకారణమే అయినా, వారు లేకపోవడం ఆమె గుండెల్లో శూన్యాన్ని మిగిల్చింది. ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా, ఆ ప్రశాంతత ఓ నిర్జీవమైన ఎడారిలా అనిపిస్తుంది.
పిల్లలు పెద్దవాళ్లై దేశాల్లోనూ, విదేశాల్లోనూ తమ గమ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటే, తల్లిగా వదులుకోవడం సహజంగానే కష్టంగా ఉంటుంది. కానీ తల్లి తన స్వార్ధాన్ని పక్కన పెట్టి, వారి భవిష్యత్తు కోసం వాళ్లకి ఆశీర్వదిస్తుంది. పిల్లల ఎక్కడ ఉన్నా సుఖంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటుంది.
అందరికీ విజ్ఞప్తి:
మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి అల్లరిని, వారి ప్రేమను ఆస్వాదించండి. వాళ్లతో ఎక్కువ సమయం గడపండి. ఆప్యాయత పంచండి. తల్లితండ్రుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలోని మధురమైన రోజులు మీతో భాగస్వామ్యం అవుతాయి.
పిల్లల ప్రేమ, హడావిడి అనుభవించడం తల్లిదండ్రుల జీవితంలోని అందమైన భాగం. వారు ఎదిగిపోయాక, ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగుల్తాయి. అందుకే, పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని సంతోషంగా ఆస్వాదించండి.
తల్లిగా 💓💓💓
హిప్నో పద్మా కమలాకర్







Comments