Believing by writing all that I've read is the antidote to fear'
- Mind and Personality Care

- Mar 31, 2023
- 2 min read
ఏప్రిల్ ౩ వ తేదీన జరగబోవు 10 వ తరగతి పరీక్షలు గురించి విద్యార్థులకు
డా. హిప్నో పద్మా కమలాకర్ సూచనలు
“చదివిన మేరకు రాయగలమన్న నమ్మకమే
పరీక్షా భయానికి విరుగుడు”
1. తాము చదివిన విషయాలు పరీక్షలలో వస్తాయే... రావో.... నన్న ఆలోచనే పరీక్షా భయానికి మొదటి మూల కారణం.
సిలబస్ పూర్తిగా చదవకుండా కొన్ని ముఖ్య ప్రశ్నలను మాత్రమే చదివే విద్యార్థుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి వారు తాము చదవని విషయాలు పరీక్షలలో వస్తాయనే ఆందోళనతో తాము నేర్చుకున్న విషయాలు కూడా జ్ఞప్తికి తెచ్చుకోలేని మానసిక దౌర్భల్యానికి గురవుతారు. దానితో మనసంతా శూన్యంగా మారి అయోమయంలో పడిపోతారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి అనుగుణంగా మనసుకు తగిన శిక్షణ ఇచ్చుకోవాలి.
ఈ ప్రపంచంలో ఎంత మేధావులైనా తమకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పడం, రాయడం చేయగలరు. తెలియని విషయాలలో వాళ్లు కూడా విద్యార్థులతో సమానం. కాబట్టి "నేను తెలుసుకొన్న, నేర్చుకున్న మేరకు పరీక్షలలో ఏ ప్రశ్నలు ఇచ్చినా సమాధానాలను రాయగలను... తెలియనివి ఇచ్చినప్పుడు భాధపడను... బెంగపడను… అందోళన చెందను...” అని మనసుకు పలు సూచనలు ఇచ్చుకోవాలి. అలా చేయటం మూలంగా మనసు ఒత్తిడిని తట్టుకొని తెలిసిన ప్రశ్నలకైనా గొప్పగా సమాధానాలు రాయగలిగే స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు చదివిన విషయాలన్నీ కూడా 'సబ్ కాన్షస్ మైండ్'లో నిక్షిప్తమై ఉంటాయి. అయితే విద్యార్థులు 'కాన్షస్ మైండ్'తో పరీక్షలు రాస్తారు. కావున 'సబ్ కాన్షస్ మైండ్ లోని విషయాలు కాన్షస్ మైండ్' లోనికి రావాలంటే ఒత్తిడి రహితంగా ఉండాలి. పరీక్ష స్వరూప స్వభావాలు, స్థితి గతుల పట్ల అవగాహనతో కూడిన మానసిక సంసిద్ధతే కాన్షస్ మైండ్ ను ఒత్తిడి లేకుండా ఉంచగలదు. దీనికి యోగ, మెటేషన్, సెల్ఫ్ హిప్నాసిస్ ప్రక్రియలు, ఆటలు కొంత సహకరిస్తాయి.
2. విషయాలను నేరుగా కాకుండా అయోమయ స్థితికి గురి చేసే విధంగా ” పరీక్షలలో అడిగే ప్రశ్నలు పరీక్షా భయానికి రెండో కారణం”. సబ్జెక్టులను నేర్చుకొనేటప్పుడు విద్యార్థులు ఆ శాస్త్ర మూలాలను, సూత్రాలను, ఉద్దేశాలను తెలుసుకోకుండా కేవలం అంశాలను మాత్రమే అధ్యయనం చేయటం మూలంగా ఈ సమస్య ఏర్పడుతుంది. కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు, సామజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దాని పరిణామక్రమాన్నే విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. సమయాభావం మూలంగా ఉపాధ్యాయులు వాటిని బోధించలేక పోతే వాటిని విద్యార్థులు తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. తద్వారా ప్రశ్నలను ఎన్ని రూపాలలో మార్చి ఇచ్చినప్పటికీ సమాధానాలు రాయగలిగే ప్రజ్ఞాపాటవాలను విద్యార్థులు అలవర్చుకోగలగుతారు. ప్రతీ సబ్జెక్టు ఆవిర్భావానికి మూలాలు ఉంటాయి.
3 . పరీక్షలలో వచ్చే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు రాయగలమో లేదోననే అనుమానం పరీక్షాభయానికి మూడో కారణం. చిన్నప్పటి నుంచి అక్షరాలు నేర్చుకునే క్రమంలో ఉపాధ్యాయులు రాసిన వాటిని మరల మరల దిద్దటం, లేదా తిరిగి రాయడం వంటి ప్రక్రియల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం మూలంగా వేగవంతంగా రాయలేని మానసిక దౌర్భల్యం ఏర్పడుతుంది. ఇది బోధన లేదా శిక్షణా క్రమంలో చిన్నప్పటి నుండి ఏర్పడిన లోపంగా గుర్తించాలి. అయితే తగిన వ్యాయామం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒకే అంశాన్ని ఒకేసారికంటే మరొక్కసారి మరింత తక్కువ సమయంలో రాయటాన్ని ఒక వ్యాయామంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఆచరించాలి. ఇరవై రెండో రోజు నుంచి తక్కువ సమయంలో ఎక్కు విషయాలు రాయడం అనేది విద్యార్థుల సహజ స్థితిగా మారిపోతుంది. ఇది అంతర్జాతీయంగా అనుభవ పూర్వకంగా నిరూపించబడిన ప్రక్రియ.
4. విద్యార్థులు తమ సహచరులతో ఏర్పర్చుకునే పోటీతత్వం పరీక్షాభయానికి నాలుగో కారణం. మరింత శ్రద్ధగా చదువుతారన్న ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులు మధ్య ఏర్పరచే పోటీతత్వం శృతి మించి కొంతమందిలో నరాల నిస్సత్తువకు దారితీస్తే మరికొంత మందిలో అసూయ, ద్వేషాలను రేకెత్తిస్తాయి. ఇతరులు తమకంటే బాగా రాస్తున్నారేమోనన్న అనుమానంతో కొంత మంది విద్యార్థులు మానసిక దౌర్భల్యానికి లోనై పరీక్ష సరిగా రాయలేక అనారోగ్యస్థితికి గురవుతారు. పరీక్షలలో మంచి మార్కులు, ర్యాంకులు రావటానికి పరీక్షాపత్రంలో ఇచ్చే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయటం కోసం ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం లేదు. కాలపరిమితికి లోబడి ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత సిలబస్ చదువుకొంటే వచ్చే ఏ ప్రశ్నకైనా విద్యార్థులు సమాధానాలు రాయగలరు. ఈ విషయంలో తోటి విద్యార్థులతో పోటీపడి ఒత్తిడి పెంచుకోవటం అనవసరం. తప్పులు లేకుండా అందంగా అతి వేగంగా నిర్దేశిత కాల పరిధికి లోబడి పరీక్ష పత్రంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఏ విద్యార్థులైతే రాగగలుగుతారో వారు తప్పకుండా మంచి మార్కులు, ర్యాంకులు సాధించగలరు. కావున దానికి తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవటం కోసం విద్యార్థులు కృషి చేయాలి. సంవత్సరంలో రోజుకి అరగంట చదివినా ఒక్క రోజు పరీక్ష కోసం భయపడాల్సిన ఆవాసమం లేదు.
ఒక సబ్జెక్టును ఒక సినిమాలాగా ఊహించుకోగలిగితే మీరు పరీక్షలు సులభంగా రాయగలరు. (తెలుగు సబ్జెక్టును ఒక తెలుగు సినిమాలాగా, హిందీ సబ్జెక్టును ఒక హిందీ సినిమాలాగా, ఇంగ్లీష్ సబ్జెక్టును ఒక ఇంగ్లీష్ సినిమా లాగా... అలా అన్ని సబ్జెక్టులను సినిమాలాగా ఉహించుకొంటే అన్ని పరీక్షలు సులభంగా రాయగలరు). విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ను ఒక కధలా చదువుకుంటే.... పరీక్షలు సులభంగా రాయగలరు.
విద్యార్థుల్లో మేధావితనం పెరగాలి,
భయం కాదు.
- డా. హిప్నో పద్మాకమలాకర్,
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
@9390044031













Comments