Children's day
- Mind and Personality Care

- Nov 14, 2022
- 2 min read
నవంబర్ 14బాలల దినోత్సవం సందర్భంగా *బాల్యాన్ని బలహినం చేస్తున్న సమాజం*
‘తేనెలొలుకు బాల్యం నిత్యనూతన మధుర జ్ఞాపకం’.. కానీ నేటి సమాజం చేదు బాల్యం గా మిగులుస్తుంది. వేలు పట్టి నడిపించాల్సిన నాన్న ప్రేమ, చంకనేసుకుని గోరుముద్దలు తినిపించాల్సిన అమ్మ కురిపించే అమృతత్వం బాలలకు తీరని స్వప్నాలే! భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర’.. పిల్లల విషయంలో కలగానే మిగిలిపోతుంది.
డ్రగ్ కల్చర్, లైంగిక వేధింపులకు బలి అవుతుంది బాల్యం. అందరూ ఉండి అనాధలుగా బాల్యాన్ని గడిపేస్తున్నది నేటి బాలలే.జీవనగమనంలో ఎన్నో దారులు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆ దారుల్లో పూలపల్లకీలుంటాయి, ముళ్ల బాటలూ మనకు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఒక్కరూ అన్నింటినీ ఆహ్వానించాల్సిందే.. చిరునవ్వుతో పలకరించాల్సిందే.. అడ్డంకులకు ఎదురొడ్డి పోరాడాల్సిందే. అదే జీవితం అని బాలలకు ఎవ్వరూ చేప్పటంలేదు. నేను ఎవరికోసం బతకాలి, ఎందుకు బతకాలి’ అనే ఆలోచనలతో బాలల మనసు ఉక్కిరిబిక్కిరై పోతుంది. జీవితాన్ని ఎలా చూడాలో , ఎలా నెగ్గుకు రావాలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లేదు. దీని ద్వారా మానసిక ఒత్తిళ్ల కు లోనవుతున్నారు. కరోనా తరువాత ఎవరి లోకం వారిదే అన్నట్లు ఉంటున్నారు. ఎవరి కోసమూ జీవన పయనం ఆపకూడదు’ అని! చేప్పే వారేరి!
బాల్యంలోనే బీజాలు....
బాలలు బాగా చదువుకుని, జీవితంలో ఉన్నతంగా రాణించాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అయితే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే బాల్యంలోనే బీజాలు పడాలి. దీనికి తల్లిదండ్రులు, సమాజమే బాధ్యత వహించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చినంత మాత్రాన చదువు బాగా వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటే. అలాగే బాలలు కొత్తవాళ్ల దగ్గర అంత సులువుగా దేనినీ నేర్చుకోలేరని తల్లిదండ్రులు గుర్తించడం ముఖ్యం. స్కూలు వాతావరణంలో ఇమడడానికి వాళ్లకు కొంత సమయం పడుతుంది. అందుకే బాల్యంలో పిల్లలతో ఓనమాలు దిద్దించే బాధ్యతను తల్లులే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొన్నాళ్లకు వాళ్లు స్కూల్‌లో టీచర్ వద్ద నేర్చుకోవడానికి అలవాటుపడతారు. పిల్లలకు చదువు చెప్పడం వల్ల తల్లీ-పిల్లల మధ్య అనుబంధమూ పెరుగుతుంది. అందుకే ఆది గురువు అమ్మే అన్నారు పెద్దలు.బాల్యంలో మనం వేసే బీజాలే భవిష్యత్తులో వాళ్లు రాణించడానికి తోడ్పడతాయి.
ఇలా చేయండి...
* పిల్లలకు తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని ఎంచుకోండి. అది చూడముచ్చటైన రంగుల్లో ఉంటూ, వాళ్లలో బాగా ఆసక్తి కలిగించాలి.
* పిల్లల వయసు, సామర్థ్యానికి సరిపోయే ఆటలు ఆడటం.
* ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోండి.
* బాలల్లో ఉన్నా అనాసక్తిని , విసుగ్గు, చిరాకులను పరిశీలించండి.
*కథలు చేపుతున్నప్పుడు కథనం, పాత్రలో పూర్తిగా మమేకమైపోండి. పాత్రను బట్టి గొంతు మార్చడం వల్ల పిల్లలకు వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పాత్రల స్వభావం సులువుగా అర్థమవుతుంది.
* పిల్లలు అంతగా ఆసక్తి చూపకపోతే బలవంతంగా దేన్ని పూర్తిచేయడానికి ప్రయత్నించద్దు. దాన్ని పక్కన పెట్టి వేరేవి ప్రయత్నించండి.
* ఒక్కోసారి మళ్లీమళ్లీ కావాలని పిల్లలు అడుగుతుంటారు. ఇలాంటప్పుడు విసుక్కోవద్దు. తెలుసుకున్న దాన్నే మళ్లీ తెలుసుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు.* అందరితో స్నేహంగా వుండేలా అలవాటు చేయాలి.* గుడ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు తెలియ చెప్పాలి.* చిన్నారులంటేనే అల్లరికి చిరునామా. ఒక్కోసారి వారు చేసిన పనులు నవ్వును తెప్పిస్తే మరికొన్నిసార్లు చెప్పలేనంత కోపాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో గట్టిగా అరవకుండా మృదువుగా చెప్పి చూడండి.* ఆటలోనే మంచి చెడు నేర్చుకోవచ్చు . చెడు మార్గన్ని ఎంచుకునే వారు అధం పాతాళానికి చేరుకుంటారు.మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతాము అని ఆటలతో తెలుసుకుంటారు.* ఉన్నత వ్యక్తిత్వం, సానుకూల భావాలు, ఇతరుల అవసరాలు గుర్తించడం, స్నేహతత్వం, సాయపడే గుణం... మొదలైనవి అలవడేలా చూడాలి.
*నేటి బాలలే రేపటి సమాజానికి బలం అనేలా పెంచాలి.*
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్ @9390044031













Comments