Discrimination against women is psychological punishment
- Mind and Personality Care

- Nov 27, 2022
- 2 min read
మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం నవంబర్ 25న సందర్భంగా
*మహిళా వివక్షే ....మానసిక శిక్ష *
ప్రోగ్రె సివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్.లైయన్ జి.కృష్ణ వేణి
మహిళా వివక్షే మానసిక శిక్ష అని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం నవంబర్ 25 సందర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత్, ప్రకృతి 320/A లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు - వేధింపులు అనే అంశంపై ఉచిత సెమినార్ నిర్వహించారు. *మహిళల వేధింపులపై బాగా మాట్లాడిన ఉపాధ్యాయులు ఉషారాణి, రచన, మౌనిక, డా.రాజశ్రీలకు బహుమతులు అందజేసారు. డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 25 న మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. మహిళలను గౌరవిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింసే తొలిస్థానంలో నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. ఆడపిల్ల బయటకు వచ్చి పని చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి 5 గురులో 3 వేధింపులకు గురౌతున్నారన్నారు. మహిళలు, బాలికల పై జరుగుతున్న శారీరక, మానసిక వేధింపులు బహిరంగంగా తెలియ చెప్పాలన్నారు.
గాంధీజీ అర్థరాత్రి స్వేచ్ఛ ఉండాలన్నారు, కానీ స్త్రీకి పగలే ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను హింసిస్తే దేశం నాశనమవుతుందని తెలిపారు.
నేటికీ అన్ని రంగాల్లో మహిళలపై వేధింపులు కొనసాగుతునే ఉన్నాయన్నారు. ఒక మనిషి పుట్టుక నుండి ఒక వయసు కి వచ్చేవరకు తల్లి ప్రేమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఒక కుటుంబంలో తల్లి లేకుంటే ఇబ్బందులు అనేవి చెప్పనలవి కావన్నారు. పుట్టుక నుండి ఓ వయసు వచ్చేవరకు ప్రతిదాంట్లో తోడు నీడై మనల్ని పెంచుతుందన్నారు. ఆమెను మాటల తూటాలతో మనసుకు తూట్లు పొడుస్తున్నామని తెలిపారు. దీని వల్ల బంధాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందన్నారు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని చెప్పారు . ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణలో ఉండాలన్నారు. భాగస్వామిని కొట్టడం, మానసికంగా హింసించడం, వైవాహిక అత్యాచారం, స్త్రీ హత్య, లైంగిక హింస మరియు వేధింపులు , అత్యాచారం, బలవంతపు లైంగిక చర్యలు - వివాహం, పిల్లల లైంగిక వేధింపులు, వీధి వేధింపులు, వెంబడించడం, సైబర్ వేధింపు,మానవ అక్రమ రవాణా, బానిసత్వం, లైంగిక దోపిడీ వంటి సమస్యలు 45% మంది మహిళలు తాము అనుభవించినట్లు నివేదించారన్నారు. 10 మంది మహిళల్లో 7 మంది భాగస్వామి వల్ల వేధింపులకు గురవుతున్నారన్నారు.బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు తీవ్రమవుతున్నాయని 10 మందిలో 6 మంది అభిప్రాయపడ్డారన్నారు. మహిళలు మరియు బాలికలపై హింసను అంతం చేయడానికి మహిళా హక్కుల సంస్థలు మరియు స్త్రీవాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం మరియు పెట్టుబడి పెట్టడం ఆనందించదగిన విషయమన్నారు.
మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలున్నాయన్నారు. కుటుంబ సభ్యులూ, పోలీసుల అండ ఉంటే మహిళలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్, హింస,ఆమ్లదాడులు వంటి నేరాలకు పాల్పడిన వారి నుంచి నేర సంబంధిత న్యాయ సవరణ చట్టం -2013 (నిర్భయ చట్టం) రక్షణ కల్పించడంతో పాటు నిందితులకు శిక్షలు పడేలా చేస్తుందన్నారు. కట్నం వేధింపులు, వివాహేతరసంబంధాల వల్ల బాధితులుగా మారిన వారికి గృహహింస చట్టం-2005 రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఇవి కాకుండా పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్త్రీల అసభ్య చిత్ర నిషేధ చట్టం- 1986 వంటివెన్నో స్త్రీలకు అండగా ఉన్నాయన్నారు. మహిళల మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి చిట్కాలు, టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో, జి.కృష్ణ వేణి,డా.పి.స్వరూపా రాణి, డా.నాగేశ్వరీరావు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్ @ 9390044031 /40













Comments