Everyone is a mirror
- Mind and Personality Care

- Feb 4, 2023
- 2 min read
ప్రతి ఒక్కరూ అద్దం

...భర్త తన భార్యకు అద్దం.
.....భార్య తన భర్తకు అద్దం.
....కన్నతల్లిదండ్రులు తమ పిల్లలకు అద్దం.
......పిల్లలు తమ తల్లిదండ్రులకు అద్దం.
......సోదరుడు సోదరికి, సోదరి సోదరుడికి అద్దం
......మిత్రుడు మిత్రుడికి అద్దం.
...... నమ్మకం నమ్మకానికి అద్దం.
ప్రతి ఒక్కరూ అద్దం. అద్దంలా మన చేతలుంటే అసూయ, పగ, వంచన, ద్వేషం వంటివాటికి అతీతంగా మనం జీవితంలో ఉండగలం. ఈ ప్రపంచం మనకు ఓ ప్రశాంతమైన అందమైన ఉద్యానవనంలా మారుతుంది.ప్రశాంతతను అన్వేషిస్తూ జీవితమంతా పరుగెత్తక్కర్లేదు. మానసిక ఒత్తిడి, వేదన వంటివి పుట్టవు. ఇతరులకోసం బతకాలని సదాలోచన పుడుతుంది. ప్రపంచ జీవితంలో ఏ ఒక్కరూ ఒంటరిగా జీవించలేరు. ఉండలేరు. అలా ఉండాలనుకునే ఆలోచనే భయానకమైనది. సమాజంలో మనమొకరమే తప్పించి ఒకరిలో సమాజం ఉండదు. కనుకే ఇతరులకోసం మనం జీవించడం, ఇతరులు మనకోసం జీవించవలసిన నిర్బంధాలు ఏర్పడుతున్నాయి.మన జీవితంలో ద్వేషానికి ఏ కోసానా తావివ్వకూడదు. దానివల్ల మనం మానసిక ప్రశాంతతను కోల్పోతాం. మన జీవితం సమాజానికి అద్దంలా ఉండాలి. లేకుంటే జీవితం కింద పడి ముక్కలైన అద్దంలా చెదరిపోతుంది. ఇందువల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. మనం అద్దం ముందర నిల్చున్నాం అనుకోండి. అది మనతో మాట్లాడుతోంది. మీతో మాత్రమే మాట్లాడుతుంది. మీకు సంబంధించిన నిజాలతోనే అది మాట్లాడుతుంది. మీతో అది అబద్ధాలాడదు. మీరు మీ మొహాన్ని అద్దానికి చూపిస్తారు. అది మీ ముఖమే అని చెప్తుంది. అంతేతప్ప ఎవరినో చూపించదు అద్దం. మీ ముఖాన, మీ దేహాన లేదా మీరు వేసుకున్న దుస్తులలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చూపిస్తుంది. మీరు అందంగా తయరై ఉంటే దానినీ తు.చ. తప్పక చూపుతుంది. అలాగే మీ మనిషి అనుకున్నవారిని చూస్తున్నప్పుడు వారిలో లోపాలుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంతేతప్ప ఉన్నదీ లేనిదీ కల్పించకూడదు. అలాగే మీలో ఉన్న లోపాలను మీ సన్నిహితులు కూడా ఉన్నది ఉన్నట్లే చూపాలి. లేనివీ పోనివీ చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఏర్పడుతుంది. అలాగే వారిలో మంచి ఉంటే చెప్పాలి. ప్రశంసించాలి. అయితే ఆ పొగడ్త కూడా ఎల్లలు దాటకూడదు. అలాకాదని గీత దాటితే వారి వెన్నెముకను దెబ్బతీస్తున్నట్టే అవుతుంది. అబద్ధం అనేది పాపాలకు మూలాధారం. మనం ఒక అబద్ధం చెప్తే దానిని దాచడానికి అనేక అబద్ధాలు చెప్తూనే ఉండాలి. చివరకు మనం అబద్ధాలకోరుగా పేరు తెచ్చుకుంటాం. మనమీద నమ్మకాన్ని కోల్పోతాం. అబద్ధం, నిజమూ కలిపి మాట్లాడే తత్వమూ లేదా అబద్ధాలే చెప్పే తత్వమో ఉండకూడదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. కనుక సత్యానికి ఎప్పుడూ అబద్ధం జోడిచకూడదు. నిజం ఎప్పుడూ మంచి పక్కనే ఉంటుంది. నిజం స్వర్గానికి తీసుకుపోతుంది. మనిషి ఎప్పుడూ నిజాన్ని వెతుకుతూ నిజాన్నే మాట్లాడటం ద్వారా మానసిక ప్రశాంతతకు లోటుండదు. అటువంటి సత్యవ్రతుడుని భగవంతుడు సత్యవంతులలో ఒకడిగా రాసుకుంటాడు. కొందరు నవ్వడం కోసం కూడా అబద్ధం చెప్పకూడదు. ప్రజలను నవ్వించడం కోసం చెప్పే అబద్ధాలమారికి ఎప్పుడో ప్పుడు చెరుపు తప్పదు. కనుక మనం ప్రతి ఒక్కరం అద్దంలా ఉండాలి.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, గైడెన్స్ సైకో థెరపీ, హిప్నో థెరపి@9390044031/40

Comments