Experiences and Opportunities are Life's exams
- Mind and Personality Care

- Dec 29, 2021
- 1 min read
అనుభవాలు అవకాశాలూ పరీక్షలే
- Dr. Hypno Padma Kamalakar

ప్రతీ ఒక్కరి జీవితానికి ముగింపు తప్పకుండా ఉంటుంది. కానీ ఒక్కొక్కరూ తమ జీవితాన్ని ఒక్కో విధంగా అనుభవిస్తూ ముగిస్తుంటారు. కొంతమంది తమ జీవితాన్ని విషాదాలతో, భయాలతో ముగిస్తారు. మరికొంత మంది జీవితంపై ఎంతో నమ్మకంగా ఉంటూ... కృతజ్ఞతతో ముగిస్తారు. ప్రతీ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే అనుభవాలే వారికి పరీక్షలుగా భావించాలి. వ్యక్తి జీవిత కాలంలో అనుభవించిన ప్రతీ రోజూ ఓ పరీక్షే. వాటి ఫలితాలు ఆశాజనకం గానూ, నిరాశాజనంగానూ కూడా ఉండొచ్చు. ఇక చివరి దశలో వారు అనుభవించే స్థితిని బట్టి వారు జీవితాన్ని అనుభవించిన వైఖరిని తెలుసుకోవచ్చు. కొందరు తాము అనుభవించిన జీవితం పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తారు. మరికొంత మంది తాము అనుభవించిన జీవితం పట్ల అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. జీవితంలో ప్రతీ ఒక్క అవకాశం ఓ అనుభవాన్ని మిగులుస్తుంది. ఈ అనుభవం జీవితంలో మూడు రకాలుగా ప్రభావం చూపుతుంది. ప్రతీ అంశం యొక్క ప్రభావం వెనువెంటనే వర్తమాన పరిస్థితిపై ఉంటుంది. కొన్నిసార్లు ఈ అనుభవం మీరు మరణించే వరకూ ఉంటుంది. మరికొన్ని సార్లు మీ జీవితంలోని అనంతమైన స్వేచ్ఛకు ఇది భంగం కలిగిస్తుంది. ఇలా మీకు ఎదురయ్యే ప్రతీ క్షణం ఓ అనుభవమే. ఈ అనుభవమే అప్పటికప్పుడు వర్తమానంపై ప్రభావం చూపినా... మరికొన్ని సార్లు దీని ప్రభావం మీ భవిష్యత్తుపైనా ఉంటుంది. కొన్నిసార్లు మీకు తప్పుడు అవకాశాలు కూడా వస్తాయి. అలాంటి అవకాశాలను మీరు వదిలేయాలి. అవకాశం వచ్చింది కదా..అని మీరు ఉపయోగించు కోవాలనుకుంటే.. అది మీ పతనానికి దారి తీయవచ్చు. మీ అభివృద్ధిని అడ్డుకోవచ్చు. ప్రతీ అవకాశం మీ జీవితానికి ఓ బహుమతే. కానీ అవకాశాల వినియోగంలో మీరు విచక్షణతో వ్యవహరించాలి. గొప్ప అవకాశాలను మాత్రమే అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే.. మీ జీవితమే అంధకారం కావొచ్చు.


Comments