Having everyone, Students live as Orphans
- Mind and Personality Care

- Sep 20, 2023
- 3 min read
* అందరూ ఉండి అనాధలుగా బ్రతుకు తున్నది విద్యార్థులే...*
డా. హిప్నో పద్మా కమలాకర్
*ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ భారత దేశం వృద్ద భారతంగా మారిపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా......*
ఎవరికి వారు నాకెందుకులే అని... అనుకోకపోవడం వల్లే విద్యార్థుల ఆత్మహత్య లు పెరిగిపోతున్నాయి.
కాలం మారిపోయింది. పిల్లలు మారిపోయారు. ఎంతలో ఎంత మార్పు. మా రోజుల్లో మేం ఇలా పెరిగామా....? అసలు నోరు విప్పడానికి తావుండేదా....? లేదు. ఆ రోజులే వేరు. ఏం చేస్తాం...కాలం మారిపోయింది. ప్చ్....కాలం ఎప్పుడు స్థిరంగా ఉంది...? ఎప్పుడూ మారిపోతూనే ఉంది. అలా మారుతూనే ఉంటుంది. ఏం మీరు బాల్యంలో ఉన్న పరిస్థితికి మీ తల్లిదండ్రులు బాల్యంలో ఉన్న రోజులకీ తేడా లేదా...? ఇక్కడ కాలాన్ని అని ప్రయోజనం లేదు. రోజు రోజుకు కొత్త కొత్త మార్పులు రావడం కాలధర్మం! అందుకు తగినట్టుగా మనం మారకపోవడమే అసలు సమస్య. అనేక రంగాల్లో మనం ఏర్పరుచుకున్న ప్రగతి, నాగరికత కారణంగా మార్పు అన్నింటా ఉంది. మనకు అనుకూలంగా ఉన్న విషయాల్లో మనం ఈ మార్పును స్వాగతిస్తాం. అననుకూలంగా అన్పించినపుడు మాత్రం కాలాన్ని నిందిస్తాం. ఇది మనలో ఉన్న ఎదుటివాడిపై తప్పును నెట్టేసే తత్వాన్ని రుజువు చేస్తుందే తప్ప అవసరమయిన దానిని గుర్తించే సామర్థ్యాన్ని ఇవ్వదు. నా దగ్గరకు ప్రతిరోజూ చాలా మంది తల్లిదండ్రులు వస్తుంటారు. తమ తమ పిల్లల మానసిక సమస్యలకు పరిష్కారాన్ని ఆశిస్తారు. ఇంచుమించుగా 3 సం॥ల వయసున్న పిల్లల సమస్యల దగ్గర్నుంచి, 25 సం॥ల వయసున్న పిల్లలదాకా పలు సమస్యలు, మానసికమయినవి, కెరీర్‌కు సంబంధించినవి, చదువుకు సంబంధించినవి, ప్రేమాయణాలకు సంబంధించినవి. అనేక సమస్యల్లో మూలాలను పరిశీలించినపుడు నాకు తోచింది ఒక్కటే, అన్‌సక్స్‌స్ ఫుల్ పేరెంటింగ్ ! కారణాలు ఏమయినా కావచ్చు. జరిగింది మాత్రం ఒక్కటే. పిల్లలు స్వేచ్ఛగానూ, మనోవికాసంతోనూ పెరిగే వాతావరణం కల్పించకపోవడం. దీంతో పిల్లల పెంపకం ఒక సమస్యగా మారింది. 30, 40 సం॥ల క్రితం ఇది ఒక సమస్య కానేకాదు. కౌన్సిలింగ్ నిపుణులను ఆశ్రయించాల్సినంత సమస్య అసలే కాదు. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. వీటి నడుమ ఉన్న తేడాలను గురించి చెప్పడం మొదలు పెడితే అది మరో గ్రంథం అవుతుంది. చాలా విభిన్నమయిన పరిస్థితులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు ! ఏమిటి అని ప్రత్యేకంగా అడిగితే ఏమని చెప్పగలం..? ఆ రోజుల్లో సమిష్టి కుటుంబాలు ఉన్నాయి. ఇపుడు ఉన్నాయా...? అపుడు కాన్వెంట్ చదువులు ఉన్నాయా...? ముక్కుపచ్చలు కూడా సరిగ్గా ఆరని పిల్లలను క్రెష్‌లలో వదిలిపెట్టే పరిస్థితులు ఉన్నాయా....? ఇలా అనేక విషయాలు మార్పును తీసుకువచ్చాయి. అందుచేత నేటి కాలమాన పరిస్థితుల్లో పిల్లల పెంపకాన్ని ఒక కన్వెన్షనల్ ( అనాదిగా వచ్చే సాంప్రదాయం) గా భావించడానికి వీలు లేదు. నేడు పిల్లల పెంపకం ఒక సవాల్....! అలాగని నేను సమస్యను మరీ పెద్దది చేసి చూపించాలని అనుకోవడం లేదు. పిల్లల పెంపకానికి తల్లిదండ్రులకు కావల్సింది కేవలం ఒక మంచి ఆశయం మాత్రమే కాదు, ఆ ఆశయాన్ని ఆధారంగా చేసుకుని, ఒక బృహత్కర కార్యాన్ని సవ్యంగా నిర్వర్తించగలిగే సామర్థ్యం. ఒక పనిని ఇలా చేయాలంటే ప్రతివ్యక్తికి శిక్షణ అవసరం. అలాగే నేటి తల్లిదండ్రలుకు కూడా పిల్లల పెంపకానికి శిక్షణ కావాలి. అంటే వాళ్లు పిల్లల్ని కనే ముందు ఎక్కడయినా చేరి పిల్లల్ని ఎలా పెంచాలనే శిక్షణ పొందాలా.....? అలా చేయడానికి అవకాశం ఉందా....? శిక్షణ పొందే అవకాశం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు ఒక విషయంలో స్పష్టమయిన అవగాహన ఉండాలి. పిల్లల పెంపకం సమస్య అనుకుంటే... ఉన్న సమస్యను ఉన్నట్టుగా గుర్తించేలా చేయాలని ..... రాకెట్‌ను ఆకాశంలోకి పంపాలంటే రాకెట్ పనితనం గురించి, తయారీ గురించి కావల్సిన సాంకేతిక సమాచారం కావాలి. ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలాగే పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం తెలియాలి. పిల్లలు ఏయే దశల్లో ఎలా పెరుగుతారనే అంశాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ నేను శారీరక ఎదుగుదలకన్నా ఎక్కువగా మానసిక ఎదుగుదలకు ప్రాముఖ్యతనిచ్చాను. ఎందుకంటే మానసిక ఎదుగుదల వెనుక శాస్త్రీయ సత్యాలను తెలుసుకుంటే పిల్లలకు కావల్సిన దానిని అందివ్వడం ఎలాగో తెలుస్తుంది. పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తుంటే, ఇపుడే కదా పాలు తాగించాను. ఇంతలోనే ఆకలేమిటి వీడికి అని ఆశ్యర్యపోయే తల్లికి, గుక్కపెట్టి ఏడ్చే ఆ ఏడుపు వెనకాల పిల్లాడి మనస్తత్వ కారణాలు ఉంటాయిని గుర్తించేలా చేయడమే నా లక్ష్యం. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి వేళకు కావల్సినంత తిండి పెట్టడం, పోషణ ( నర్సింగ్ ) కిందికి వస్తుంది. ఈ పోషణ బాధ్యతలను తల్లిదండ్రులు కాస్త అటూ ఇటుగా ఎలాగోలా నేర్చుకుంటారు. లేదా వాళ్లు తరుచూ సంప్రదించే వైద్యుల సలహాలను తీసుకుంటారు. ఎపుడయినా ఏదయినా లోపం ఏర్పడితే అది వెంటనే మనకు తేటతెల్లంగా కనిపిస్తుంది. కాబట్టి నివారణా చర్యలను వెంటనే తీసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. పిల్లలకు శారీరక పోషణ ఎంత అవసరమో మానసిక పోషణ కూడా అంతే అవసరం ( నర్చరింగ్ ). కాగా ఇక్కడ, మనకు ఒక పిల్లాడిలో మానసిక పోషణ సరిగ్గా కాకపోవడం వల్ల తలెత్తే సమస్య, జ్వరం వచ్చినట్టుగానో, తలపోటు వచ్చినట్టుగానో అంత తేలికగా బయట పడదు. పిల్లలు డెవలప్ చేసుకునే మానసిక అవలక్షణం ఎన్నో రోజులు...సంవత్సరాలు పోతే కానీ తెలియదు. దీనిని కాస్త ముందస్తుగా తెలుసుకోవడానికి ఉపయోగ పడేవే పిల్లల మనస్తత్వ శాస్త్ర పరిశోధనా ఫలితాలు. ఈ పరిజ్ఞానం ఏర్పరుచుకోవడం వల్ల తల్లిదండ్రులకు తమ పిల్లల మానసిక ప్రవర్తన పట్ల, ఒక ముందస్తు అభిప్రాయం ఏర్పడడానికి అవకాశాలు పెరుగుతాయి. అలా ఏర్పడే మానసిక సమస్యలను, తొలిదశలో తల్లిదండ్రులే తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. లేదా కనీసం సైకాలజిస్ట్ లను , వృత్తి నిపుణులును సంప్రదించి తెలుసుకోగలరు. నేను తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నాను. పిల్లలను అర్థం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టడానికి తల్లిదండ్రులకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. పరిశీలనాసక్తి, పిల్లల పెంపకాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలనే తపన ఉన్న తల్లిదండ్రుల ఆలోచించండి.
పిల్లలు మానసిక సమస్యలకి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే.... తప్పు అందరిదీ.....
* పిల్లలకు తల్లిదండ్రులకు మాట..మంతి ఉంటుందా...*
* పిల్లలకు సమయం ఇస్తున్నారా...*
* పిల్లలకు ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు తెలుసా*
* ఏమి చదువుకోవాలని అనుకుంటున్నారో అని ఎప్పుడైనా అడిగారా...*
పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేసి, కనీస స్వేచ్ఛను, సంస్కృతి, సంప్రదాయాలను వారికి తెలియకుండా, వారి వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇటు ఇంట్లో, అటు సమాజం, విద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు వారిని మానసికంగా కృంగదీస్తున్నాయి.
పిల్లలు ఏం చదువుతారు? ఎలా చదవాలనుకుంటున్నారు?, భవిష్యత్‌లో వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? అన్నదానిపై తల్లిదండ్రులు పూర్తిగా తెలుసుకొని వారిపై ఒత్తిడి లేకుండా పిల్లలకు తల్లిదండ్రులుగా తమ వంతు బాధ్యత వహించినప్పుడే ఈ ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి.
డా.హిప్నో కమలాకర్ రచించిన మనము - మన పిల్లలు పుస్తకం చదవండి *
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031/40



Comments