
Is Rape against a woman festival for you?
- Mind and Personality Care

- May 3, 2022
- 2 min read
కష్ట కాలంలో ఉన్న వారికి ఓదార్పు అనేది చాలా అవసరం. ఆ సమయంలో ఆర్థికంగా నే కాదు.. నీకు మేమున్నామంటూ నలుగురు వచ్చి భరోసా ఇస్తే ఎంతో ఉరటనిస్తుంది..
ఒక మహిళ పై రేప్ జరిగితే కొందరికి పండుగా..?
మనిషి సంఘ జీవి కాబట్టి ఇలాంటి ఓదార్పు నివ్వడం అందరి కర్తవ్యం కూడా..
అయితే పక్క వారి కష్టాన్నుంచి, వారికి అందించే ఓదార్పు నుంచి మనకేమైనా మైలేజ్ దక్కితే బాగుండు అని ఆలోచించే వారు ఉంటారా అంటే నిస్సందేహంగా కొందరు రాజకీయ నేతలు నిస్సిగ్గుగా ఇలానే వ్యవహరిస్తున్నారు అని చెప్పక తప్పదు..
దీనికి ఉదాహరణలు గత కొద్ది రోజులుగా చాలా కనిపిస్తున్నాయి..
బలత్కారానికి గురై షాక్ లో ఉన్న బాధితురాలిని పరామర్శ ల పేరిట మరోమారు కోలుకోలేని షాక్ కు గురి చేస్తున్న నేటి కాలపు మహా నేతల గురించి ఏమనాలో అర్దం కావడం లేదు..
తన ప్రమేయం లేకుండానే ఇతరుల సుఖాల కోసం నరక యాతన అనుభవించే ఏకైక ప్రాణి స్త్రీ యే...
మగాళ్ళ క్షణిక సుఖాల కోసం అబలలపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు..
ఒక్కోసారి నమ్మించి మోసగించే వారి చేతుల్లో... మరో సారి ముక్కు మొహం తెలియక పోయినా ఆడదైతే చాలు అవసరం తీర్చుకోవాలని చూసే కామాంధులు ఎందరో..
రేప్ జరగటం అనేది కొత్త విషయమా అని కొందరు వెక్కిరిస్తూ విషయాన్ని పక్క దోవ పట్టిస్తుంటారు.. అలాంటి మూర్ఖుల కన్నా దారుణంగా మరికొందరు పరామర్శ ల పేరిట అరాచకియ విన్యాసాలకు పాల్పడుతున్నారు.
పశువుల్లా తన శరీరంపై పడి కామాన్ని తీర్చుకున్న వారు కొందరైతే.. ఆ షాక్ కు గురై మగాళ్ళంటేనే భయపడే మానసిక స్థితిలో విలవిలలాడుతూ ఉంటుందా బాధితురాలు..
ఆ స్థితిలో ఆమెను ఓదార్చాలని దగ్గరికెళ్లిన తల్లిని అమ్మా ఆడదానిగా పుట్టడమే నా పాపమా అన్నంతగా ప్రశ్నిస్తుందా అమాయకపు ఆడబిడ్డ..
తన తప్పేం లేకపోయినా
లోకానికి మొహం చూపించు కోవడానికి భయపడిపోతూ ఉంటుంది. అందుకే కోర్టులు సైతం రేప్ కు గురైన వారి గుర్తింపు తెలిసే ఎలాంటి వివరాలు మీడియాలో చూపించ కూడదని, పత్రికల్లో ప్రచురించ కూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాయెప్పుడో...
బాధ్యత గల మీడియా సంస్థలన్ని దీన్ని అనుసరిస్తున్నాయి కూడా.. ఎటొచ్చి ప్రతి ఘటనను తమ మైలేజ్ కి వాడుకోవడం మీద దృష్టి పెట్టిన కొందరు నేతలు మాత్రం రేప్ బాధితురాలి వద్దకు వందలాది మందిని తీసుకెళ్తున్నారు.
వీళ్ళందరికీ తన గురించి తెలిసిపోయిందే అన్న బాధతో ఆ అభాగ్యురాలు బలవంతంగా ప్రాణం తీసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు?
సాధారణంగా అత్యాచారానికి గురైతే
తనకిక పెళ్లి కాదేమో అని యువతులు, భర్త సరిగ్గా ఏలుకొడేమో అని వివాహితలు ఆత్మహత్య దిశగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి, ఉన్నత శిఖరలకు చేరుకోవాల్సిన వారు కూడా కుమిలిపోతూ కెరీర్ కు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి వారిని మా వద్దకు తీసుకొస్తే తగిన విధంగా కౌన్సెలింగ్ చేసి మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించేలా ప్రయత్నిస్తూ ఉంటాము.
కౌన్సెలింగ్ గురించి తెలియని వారు ఆ కుటుంబ సభ్యులైనా సరే
బాధితురాలి తో సరిగ్గా వ్యవహరించకపోతే ఆమె కుంగుబాటు నుంచి మామూలు మనిషి అవ్వడానికి చాలా కాలం పడుతుంది. ఒక్కోసారి పిచ్చివాళ్లు గా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే సున్నితమైన ఆమె మనసు గ్రహించి ప్రతి ఒక్కరూ ఆమెకు మరింత సున్నితంగా ఓదార్పునివ్వాలి.
మిగతా అంశాల్లో ఎన్ని రాజకీయాలు చేసుకున్నా అత్యాచార బాధితురాళ్ల విషయంలో ఏ ఒక్కరూ హద్దులు మీరొద్దని సాటి మహిళగా విన్నవిస్తున్నా.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్
మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ సెంటర్
రాజమండ్రి, హైదరాబాద్
@9390044031/40



Comments