Life is a Deepali
- Mind and Personality Care

- Nov 11, 2023
- 3 min read
జీవితమే ఒక దీపావళి
ప్రతి పండుగ వెనుకా ఓ పరమార్థం ఉంటుంది. పండుగలు ఆనందాన్నిస్తూనే జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకోడానికి వీలుగా అనేక సందేశాలను అందిస్తాయి. వాటిని అందిపుచ్చుకుని వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టుకుంటూ తోటివారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు పోవడమే మన కర్తవ్యం.
ఇళ్ళన్నీ దీపకాంతులతో కళకళలాడే విశేషదినం; ముంగిళ్ళన్నీ వెలుగుపూలతో విరబూసే పుణ్యదినం; మోములన్నీ నవ్వుల వెలుగులతో శోభించే శుభదినం; దుష్టశక్తులను సంహారించే దినం; కథలు...కవితలు పోటీలు.కొత్తబట్టల మెరుపులు..మిఠాయిల ఘుమఘుమలు. ఉత్సాహంతో పరవళ్ళు తొక్కే పిల్లలు ఒకవైపు, ఆనందంతో పరవశించే పెద్దలు మరోవైపు... ఇలా ఎటుచూసినా ఉత్తేజాన్ని నింపే వాతావరణం, ఆహ్లాదాన్ని పంచే అనుబంధాల సుగంధం. ఈ ఆత్మీయతానురాగాల ఆస్వాదనలో మనస్సంతా ఆనందమయంగా, జగమంతా శాంతినిలయంగా మారిపోతుంది. అయితే, ఈ ఆనందాలు కేవలం ఒక్కరోజుకే పరిమితమా? మన జీవితాలు నిరంతరం ఆనందమయంగా ఉండాలంటే, మన సమాజం శాంతినిలయంగా మారాలంటే మన జీవితమే ఒక దీపావళి కావాలి. అందుకు దీపావళి ప్రబోధించే జీవన సూత్రాలను ఆచరించాలి, విలువల పాఠాలను అభ్యసించాలి. సమాజం శాంతినిలయంగా మారాలంటే దుష్ట శక్తులను నాశనం చేయాలి. జీవితం ఆనందమయంగా ఉండాలంటే మనస్సులోని దురాలోచనలను పారద్రోలాలి. పవిత్ర మనస్సుతో సాధన చేయాలి. ఏ పండగ అంతరార్థాన్ని విశ్లేషించినా మానవుడు తనలోని దానవగుణాలను హతమార్చి, మానవత్వంతో జీవించాలన్నదే... ఈ పండుగలు, పర్వదినాలను జరుపుకోవడంలోని ముఖ్యోద్దేశం మానవజీవిత పరమార్థాన్ని మరచిపోకుండా ఉండేందుకే! ప్రపంచం శాంతి నిలయంగా మారాలన్నా, నివాసయోగ్యంగా ఉండాలన్నా దుర్మార్గులు, స్వార్థపరులు, అధర్మవర్తనులు సమూలంగా నాశన మొందించాలి. లోకక్షేమానికి భంగం కలిగించే దుర్మార్గుడైన నరకాసురుడును హతమార్చిన సందర్భంగా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జరుపుకునే పండగే దీపావళి.... ఇంతకీ ఈ నరకాసురుడు మానవులను, మునులను, దేవతలను హింసలకు గురిచేస్తూ, ఎంతోమంది స్త్రీలను చెరసాలలో బంధించి అకృత్యాలకు పాల్పడుతూ, ముల్లోకాలనూ పట్టి పీడిస్తుండేవాడు. .ఈ దానవేంద్రుడు పెడుతున్న బాధలకు తాళలేక మానవులు,| మునులు, దేవతలు నరకాసురుని వధించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. నరకాసురుడు తన కుమారుడైనప్పటికీ లోకక్షేమం కోసం, ప్రజాసంక్షేమం కోసం వధించారు. విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి చెడుస్నేహాల చెరలో చిక్కుకుపోవడం వల్ల వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా ఒక్కోసారి ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తుతాయని గ్రహించాలి.నేటి సమాజంలో విచ్చలవిడిగా, అదుపాజ్ఞలు లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నా దుర్మార్గులను శిక్షించడానికి కడుపుతీపి, బంధుప్రీతి, అధికారశక్తి, స్వలాభాపేక్ష స్వార్ధబుద్ధి అడ్డుతగులుతున్నాయి. అరాచకాలు, అకృత్యాలూ, అన్యాయాలూ చేస్తే కఠినంగా శిక్షింపబడతామనే భయం లేకపోవడం వల్ల దుర్మార్గులు స్వేచ్ఛావిహారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశం శాంతినిలయంగా ఉంటుంది? ఏ సమాజం నివాసయోగ్యమవుతుంది?
సమాజంలో చీడపురుగులు లేకుండా చేయాలంటే తల్లితండ్రులు 'మొక్కైవంగనిది మానై వంగునా" అనే సామెతను గుర్తుంచుకొని పిల్లల్ని చిన్నప్పటి నుండే సన్మార్గంలో నడిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల్లితండ్రులు పిల్లల్లో, అబద్దాలాడడం, దొంగతనం చేయడం, ఇతరులను హింసించడం లాంటి దుర్గుణాలను గమనించినప్పుడు వారిని సమర్ధించకుండా, సరిదిద్దడానికి ప్రయత్నించాలి. తల్లితండ్రులు పిల్లల మనస్సులోని కలుపు మొక్కలనే చెడు భావాలను ఎప్పటికప్పుడు త్రుంచివేయాలి. అప్పుడు మాత్రమే మన సమాజం నరకాసురులు, రావణాసురులు, బకాసురులతో కాకుండా హరిశ్చంద్రుడు, రామచంద్రుడు, శిబిచక్రవర్తి లాంటి త్యాగశీలులతో నిండిపోతుంది. అలాంటి ప్రపంచమే శాంతి నిలయంగా మారుతోంది.
ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం. అలాగే జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి కృషి చేయాలి. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి. కష్టాలకు కంగారుపడకుండా ధైర్యజ్యోతులను నింపుకుని వాటికి స్వస్తిపలకాలి. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ సాటిమనిషి కష్టంలో ఒక ఓదార్పుగా, దారిచూపే వెలుగుగా నిలుస్తూ జీవితానికి సార్థకతను చేకూర్చుకోవాలి. మనలో ఉన్న దోషాలూ బలహీనతలపై, సంపూర్ణ ప్రయత్నంతో విజయాన్ని సాధించి వ్యక్తిత్వ పరిపక్వతను పొందాలి.
చీకటి దు:ఖానికీ, వెలుగు ఆనందానికి సంకేతాలు. మన జీవితంలో దు:ఖమనే చీకటిని పారద్రోలి, ఆనందమనే వెలుగును నింపాలన్నదే దీపావళి మనకిచ్చే సందేశం. అయితే, జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి అవసరమైన నిరంతర పరిశ్రమ,సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, ప్రేమ, సేవాభావం లాంటి ఉన్నత లక్షణాలను అలవరచు కోవాలి. ఈ లక్షణాలన్నీ దీపావళి నాడు మనం వెలిగించే దీపాల వెలుగులు సోమరిగా ఉండకుండా ఉత్సాహంతో నిరంతరం శ్రమించాలి', జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలనీ, సానుకూల దృక్పథంతో ఆలోచించాలనీ, ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ నేర్పుతుంది; ఎవరికీ హాని కలిగించకూడదనీ, మనల్ని చూసి ఎవరూ భయపడకూడద'నీ తెలుపుతుంది; వెలుగుతున్నంత సేపూ అందరి దృష్టిని ఆకర్షించే దీపాలు ఆనందపరుస్తూ, అందరి మన్ననలను పొందుతుందని నేర్పుతుంది. భూమి నుండి సహనాన్నీ, సూర్యుడి నుండి సమదృష్టినీ, చంద్రుని నుండి చలించని మనస్తత్వాన్నీ, అలాగే పక్షులు, జంతువుల నుండి ఏకాగ్రతనూ, నిస్వార్థతనూ, ఇంద్రియ నిగ్రహాన్నీ, నిరంతర పరిశ్రమనూ... ఇలా ఎన్నో జీవన సూత్రాలను చూడోచ్చు. సావధానంగా పరిశీలిస్తే మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి, వస్తువుల నుండీ, మనతోటివారి నుండీ ఎన్నో జీవన సూత్రాలను నేర్చుకోవచ్చు. ఉన్నత ఆదర్శాలతో జీవించవచ్చు.
దీపజ్యోతిని పరిశీలించినట్లయితే జ్యోతిలో మొదట ఎరుపురంగు, తరువాత తెలుపురంగు, ఆ తరువాత నీలిరంగు కనబడతాయి. దేహమనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలనే దుష్ట శక్తులు ప్రవేశించలేవు. అలాగే, దీపజ్యోతిలోని మూడు రంగులూ సత్వ రజ తమో గుణాలను సూచిస్తాయి. ఇలా ఎన్నో విషయాలతో ముడిపడిన నరకచతుర్దశి పర్వదినం పిల్లలూ పెద్దలూ అందరికీ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. చెడుపై మంచే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఇస్తుంది. సాటిమనిషి జీవితంలో నిస్స్వార్థంగా ఆనందాల వెలుగులు నింపడానికి స్ఫూర్తినిస్తుంది.ఈ జగమంతా శాంతి నిలయంగా మారాలన్నా, మన జీవితమంతా ఆనందమయంగా ఉండాలన్నా దీపావళి ప్రబోధించే జీవన సూత్రాలను, విలువల పాఠాలను, సత్యాలను ఆచరించాలి. అందుకు మన జీవితమే ఒక దీపావళి కావాలి !
బాణసంచా ఆరోగ్యానికి హానిదీపావళి అంటే టపాసుల పండగగా మారిపోయిందిగానీ, దాని అసలు ఉద్దేశం అంధకార తిమిరాన్ని జయించేందుకు దీపాల వరసలు పెట్టడం. మొదట్లో ఉప్పుపొట్లాలవంటి సాధారణ టపాసులతో మొదలైన సందడి, పోనుపోను రసాయనాల వాడకంతో వచ్చే కాంతి, శబ్దాలకు అంతా ఆకర్షితులు కావడంతో పెద్ద మతాబుల పరిశ్రమగా మారిపోయింది. రెండేళ్ల క్రితం ఇండియాలో అయిదేళ్లలోపు చిన్నారుల్లో 1.16 లక్షల మంది అకాల మృత్యువాతపడ్డారు. అందులో సగానికి పైగా మరణాలకు వాయుకాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.. వాటివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. మతాబులను కాల్చే సమయంలో గర్భిణులు బయటకు రాకపోవడం మంచిదన్నది వైద్యవర్గాల సూచన. ఆ సమయంలో గాలిలోకి వెలువడే రసాయనాల వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలపైనా ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. పండగ సరదాలు కాదనలేనివే. ఆరోగ్యానికి పొగపెట్టేలా అవి మారకూడదన్న అంశాన్నీ విస్మరించకూడదు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, అందరూ ఆనందించేలా పండగ జరుపుకోవడం ముఖ్యం. ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించి, సరికొత్త దీపావళికి శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాను. జైహింద్.
డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్ అండ్ ఎన్.ఎల్.పి. మాస్టర్ ట్రైనర్. @9390044031 /40





Comments