Lucky or Unlucky - It's all in your perception.
- Mind and Personality Care

- Dec 22, 2021
- 2 min read
* మీ భావనే అదృష్టం దురదృష్టం * కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్

ఒక ఊళ్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఓ గుర్రం ఉండేది. ఒక రోజు అతని గుర్రం ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆ రైతు దిగాలుపడి గుర్రం కోసం ఊరంతా వెతికాడు. గ్రామస్తులంతా ఆ రైతును చూసి జాలిపడ్డారు. ఆ రైతు వద్దకు 'ఏం చేస్తాం.. దురదృష్టం' అన్నారు.అపుడు ఆ రైతు గ్రామస్తుల వైపు చూసి.. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అన్నాడు. ఆ రాత్రి గ్రామస్తుల పరామర్శల తోనే గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రైతు లేచి ఇంటి తలుపు తీయగానే ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా సంతోషపడ్డాడు. ఎందుకంటే అతని గుర్రం మళ్లీ తిరిగి వచ్చింది. కానీ ఆ గుర్రం ఒక్కటిగా రాలేదు. తన వెంట మరో పది గుర్రాలను తీసుకుని వచ్చింది. ఈ విషయం ఈ నోట ఆ నోట గ్రామస్తులందరికీ తెలిసింది. గ్రామస్తులు గుర్రాలను చూడటానికి రైతు ఇంటికి వచ్చారు. వచ్చీరాగానే రైతును పొగడ్తలతో ముంచెత్తారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నారు. రైతు వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ... మీకు ఎవరు చెప్పారు ? అని ప్రశ్నించాడు అమాయకంగా... కొన్ని రోజులు గడిచాయి. రైతు తన గుర్రాలతో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఒక రోజు రైతు కొడుకు ఒక కొత్త గుర్రానికి శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణా సమయంలో గుర్రాన్ని సరిగా అదుపు చేయలేక పోవడంతో కింద పడ్డాడు. అతని కాలు విరిగింది. ఈ విషయం ఆ గ్రామస్తులందరికీ తెలిసింది. వారు మళ్లీ రైతు వద్దకు వచ్చారు. 'అయ్యో పాపం... దురదృష్టం' అని జాలిపడ్డారు. రైతు మళ్లీ వారు వైపు చూస్తూ... 'మీకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు .. ఆ గ్రామం వున్న రాజ్యం నుంచి ఓ పెద్ద సైన్యం వచ్చింది. వచ్చిరాగానే ఆ సైన్యం గ్రామంపై విరుచుకుపడింది. గ్రామంలో ఉన్న యువకులందరినీ ఒక చోట చేర్చింది. వారిలో ఆరోగ్యంగా ఉన్న వారందరినీ తమతో పాటు అడవులకు తీసుకెళ్లింది. అయితే ఈ రైతు కొడుకును మాత్రం ఆ సైన్యం వదిలిపెట్టింది. ఎందుకంటే.. అతడి కాలు విరగడంతో వికలాంగుడని వదిలేసింది. దీంతో ఆ గ్రామస్తులు ఆ రైతును... నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా.. అని పొగడ్తలతో ముంచెత్తారు. మన జీవితం కూడా ఇలానే ఉంటుంది. కొన్నిసార్లు మనకు మంచి జరుగుతుంది. కానీ దాని పర్యవసానం చెడుగా రావొచ్చు. మరికొన్ని సార్లు మనకు చెడు జరగవచ్చు. కానీ దాని పర్యవసాన ఫలితం అంతకు భిన్నంగా ఉండవచ్చు. మనకు నిత్య జీవితంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి. ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని అదృష్టమని, దురదృష్టమని భావించకూడదు. మీకు ఎదురైన ప్రతీ అనుభవం నుంచి ఓ పాఠాన్ని నేర్చుకోండి. అవరోధాలు ఎదురైనా.. ఆనందాలు ఎదురైనా... నిశ్చలంగా వ్యవహరించండి.


Amazing story, thank you madam