Men are sensitive - it's just they talk harsh
- Mind and Personality Care

- Nov 19, 2022
- 1 min read
నవంబరు 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా
మగాడు మనసు సున్నితం - మాట కఠినం
ప్రతీ ఏడాది నవంబరు 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ప్రపంచంలో చాలా మందికి అసలెందుకీ రోజు ఉందనే విషయమే తెలీదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇస్తున్న ప్రాముఖ్యత పురుషుల దినోత్సవ విషయంలో అంతగా కనిపించదు. ఇంతకీ పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు. పైగా నవంబరు 19వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుండి జరుపుకోగా 1969 నుండి పురుషుల దినోత్సవాన్ని కూడా జరపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
మొదటిసారిగా 1992లో ఈ పురుషుల దినోత్సవానికి శ్రీకారం చుట్టింది థామస్ ఊస్టర్ Thomas Oaster. అయితే 1999 నుంచి క్రమం తప్పక ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యకారకులు డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ Dr. Jerome Teelucksingh. వెస్టిండీస్ లోని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో హిస్టరీ ప్రొఫెసరుగా ఉండిన జెరోమ్ తన తండ్రి పుట్టిన రోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలెట్టారు.
ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక నలబై అయిదేళ్ళ లోపు గల వయస్సులో చాలా మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారంకోసం పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు.ఈ ఏడాది పురుషుల దినోత్సవం థీమ్ – “సానుకూల పురుష మార్గదర్శులు”. పురుషులకు, బాలురకు సాయమందించడం. పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన కల్పించడం. దీని ప్రకారం వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోవడం ప్రధానం. పురుషులు ఏడవకూడదు అనే భావాన్ని విడిచి పెట్టి, వారు అనుభవిస్తున్న మానసిక వేదనను ప్రశాంతంగా వెలిబుచ్చడానికి తగినంత అవకాశం ఇవ్వాలి. వారి మనుసులోని భావాలను పురుషులు అన్న కారణంగా వారిలోనే అణచి పెట్టుకోకుండా చెప్పుకోవడానికి కావలసిన మేరకు సాయమందించాలి. పురుషులకు సమస్యేం ఉంటుంది అనుకునే వారే చాలా మంది. కానీ వారిలోనూ సున్నితమైన భావాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. శారీరకంగా బలవంతుడిలా కనిపిస్తే కనిపించవచ్చు కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వరితోనూ చెప్పుకోలేక మానసికంగా నలిగిపోయే పురుషులున్నారు. పురుషుడు కనుక ఎవరికి చెప్పుకోకూడదనడం సమంజసం కాదు. మనసు తేలికపడాలంటే ఎవరో ఒకరితో చెప్పుకోగలగాలి. పురుషుల దినోత్సవం రోజున ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మంచిదే. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కొన్ని చోట్ల కమ్యూనిటీ ఈవెంట్ గానూ, కొన్ని చోట్ల ప్రత్యేక అవార్డు వేడుకగానూ జరుపుకుంటారు.
డా హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్ @9390044031













Comments