Mind is the source of happiness
- Mind and Personality Care

- Dec 30, 2022
- 1 min read
ఆనందానికి మనస్సే మూలం

జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తాడు మనిషి. ప్రశాంత మైన జీవితాన్ని ఆకాంక్షించడం సబబే. ఆనందమయ జీవితాన్ని ఆశించడం మానవ సహజం.ప్రతి మనిషికీ అత్యవసర మైనదీ, నిత్యావసరమైనదీ మనశ్శాంతి.
అది మనం బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నంత వరకూ అది మనకు ఎప్పటికీ లభించదు. తనలో నుంచే సువాసన వెలికివస్తున్నదని తెలియక కస్తూరి మృగం బయట వెతుకుతున్నట్టు మనం కూడా ఆనందానికి నిలయమైన అంతరాత్మను మరచి బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతుంటాం.రాబోయే కాలాన్ని ఫలవంతం చేసుకోవా లంటే ముందు వర్తమానాన్ని ప్రణాళికా బద్ధంగా సవరించుకోవాలి. మనశ్శాంతిని పొందడానికి ముఖ్యంగా మనం '3' అవరోధాలను దాటాలి.
అవి: శారీరక, మానసిక, అంతరాత్మ అవరోధాలు
* శారీరక అవరోధం:
జీవితంలో ఏమి సాధించాలన్నా శారీరక
సంబంధమైన సోమరితనాన్ని వదిలి పెట్టాలి.దీనినే వేదాంత భాషలో తమోగుణం అని అంటారు. జీవితమంతా తిండి, నిద్రలకే
పరిమితమై, సుఖభోగాలే జీవితలక్ష్య
మనుకుంటే మనిషి పశుత్వం నుండి
ఎన్నటికీ బయటపడలేడు.
* మానసిక అవరోధం :
సుఖదుఃఖాల్లోనూ, జయాపజయా
ల్లోనూ చలించని మనసు కలవాడే నిజమైన మనిషి. శాంతిని కామం, క్రోధం, లోభం మొదలైన దుష్ట చింతనలను మనసు లోనికి రానీయకుండా సదా మనస్సుని అప్రమత్తంగా ఉంచుకోవాలి. కట్టులేని మనస్సు, కట్టతెగిన సరస్సు లాంటిది. అది మనిషిని అశాంతిపాలు చేస్తుంది.
* అంతరాత్మ అవరోధం :
శారీరక, మానసిక స్థాయిల్లో మనం
పొందే ఆనందం ఉద్వేగభరితమైనదే కానీ,
నిజమైన ఆనందంకాదు. నిజమైన ఆనందం
అంతరాత్మ నుంచే లభిస్తుంది. ఈ జన్మలోనే
ఆ అనంత ఆత్మానందాన్ని పొందాలి.
సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి చేరినా
సముద్రం మాత్రం ఎటువంటి అలజడికి
లోను కాదు. అలాగే దృఢచిత్తం కలవారిలో
ఎన్ని కోర్కెలు ఉదయించినా వారిని
చలింపచేయలేవు. అశాంతికి కారణం మమకారమే. దుఃఖాలకు కుంగిపోక,
సుఖాలకు పొంగిపోకుండా ఉండటమే మమకారం. భయ క్రోధాదులు వీడడమే
స్థితప్రజ్ఞత్వం. అటువంటి మనస్సున్న వ్యక్తి ఏపనైనా విజయవంతంగా చేస్తాడు. ఉద్రేకం, ఆర్భాటం వల్ల అశాంతే తప్ప, పని
జరగదు. మృదువుగా, సమర్థవంతం
కార్యాన్ని నిర్వహించడమే యోగం.
మనం ప్రసన్నతను పొందినప్పుడు దుఃఖాలన్నీ నశిస్తాయి. ఉన్నదానితో సంతృప్తి పొందడంలోనే నిజమైన ఆనందం
ఉంటుంది. అందుకే సహనానికి మించిన
గుణం, సంతృప్తిని మించిన సంపద
మరొకటి లేదని పెద్దల మాట. సాధనతో
మనసులో ఉన్న కామ, క్రోధ, మోహ,
లోభాలనే దొంగలను పారదోలాలి.
కొత్త సంవత్సరంలో మనస్సు అనే బుద్ధిని మంచి ఆలోచనలతో ఉంచితే దేదీప్యమానంగా వెలుగొందుతుంది.
సరికొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031 / 40







Absolutely correct madam🌹