When mind loses control, Mental illnesses step in..
- Mind and Personality Care

- Feb 23, 2022
- 3 min read
మనసు (కోతి) గతి తప్పితే మనో వ్యాధులే...
మనసు అనగానే మనసుకవి ఆత్రేయ గుర్తుకు వస్తారు. "మనసు" మీద ఆయన రాసినన్ని పాటలు ఇంకెవ్వరూ రాసి వుండరు. మనసు అది చేసే గారడీలకు అంతేలేదు. ఒక విధంగా మనిషి మనసు చేతిలో కీలుబొమ్మ, సమస్త జీవులన్నిటినీ చెలాయించగలిగే మనిషి "మనసు" చేతిలో వశమైపోవటం కాస్త విచిత్రంగానే వుంటుంది. అయినా ఇది కఠినమైన వాస్తవం. మనిషి బుద్ధిజీవి. ఏ జీవరాశికీ లేని మహా మేధాశక్తి మనిషి సొత్తు. అన్ని రకాల సమస్యా పరిష్కారశక్తి మనిషికి వుంది. ఈ పరిష్కారశక్తి జన్యువుల ద్వారా, అనువంశికంగా మానవునికి సంప్రాప్తిస్తుందని జన్యుశాస్త్ర నిపుణులు అంటున్నారు. అటువంటి మేధా సంపత్తి వున్న మనిషి శరీరంలో రెండు పరిపూర్ణమైన వ్యవస్థలు వున్నట్లుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. అవి మన శరీరం, మన మనసు. మన మెదడు మానసిక వ్యవస్థకు కేంద్రం. విచిత్రమేమంటే "మన"లో తొంభై ఎనిమిది శాతం పరిమాణంలో వున్న మన శరీరాన్ని కేవలం "2" శాతం మాత్రమే వున్న మెదడు శాసిస్తుంది. మనిషి శరీరం-మనసు పరస్పర సహకారంతో ఉంటాయి కాబట్టి మానవశక్తి సద్వినియోగ పడుతూ వుంటుంది. ఈ మనసు.... ఎక్కడుంది...? దీని స్వరూపం ఏమిటి..? మెదడు కన్పించినట్లుగా మనకు ఈ మనసు కన్పించదు. కానీ మెదడులోనే మనసు వుందని ఫ్రాయిడ్ అంటూండేవాడు. ఫ్రాయిడ్ బ్రెడ్ తో కల్సి న్యూరలాజికల్ స్టడీస్ చేస్తున్నాడు. బ్రెడ్ ఎప్పుడూ, మెదడుని బ్రెయిన్" (మస్తిష్కం) అనే వ్యవహరించే వాడు. ప్రాయిడ్ మాత్రం దాన్ని మస్తిష్కం అనకూడదనే వాడు. అది మనసు అని దాన్ని 'మైండ్” అనమని ప్రోద్భలం చేసేవాడు. ఫ్రాయిడ్ ఆలోచన ప్రకారం బ్రెయిన్ లోనే మైండ్ వుంటుంది. బ్రెయిన్ కేవలం కండరాల వంటి, పదార్ధం కాదని, అందులో నాడీ కణాలతో బాటూ ఆలోచనా స్రవంతులు వుంటాయని అంటూ వుండేవాడు. అంచేత బ్రెయిన్లోనే మన మనసు దాగి వుంటుందని ఫ్రాయిడ్ అనేవాడు. మనసొక భావాల పరంపర. సంకల్పం ఆలోచనలు మనసు గుర్తింపుకు ఆధారాలు. ఇది ఒక రూపం అంటూ లేని ఒక అజ్ఞాత శక్తి. పంచేంద్రియాల ప్రమేయం : మనం మనకు గల ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని గ్రహిస్తాం. ఈ ప్రపంచంలో మన శరీరం ఒక భాగం అయితే, ప్రపంచమంతా మనసులో ఒక భాగంగా మారి పోతుంది. మన మనసులో వుండే ఈ భాగం ఎవరికీ ఒకే రకంగా వుండదు, ఎవరి ప్రపంచం వారిది. నీ ప్రపంచం నీది. నా ప్రపంచం నాది. నీకు నాకు మధ్య వైరుధ్యాన్ని సృష్టించే మానసిక ప్రకంపనాలు వేరు. అవి అందరికీ ఒకేలా వుండవు. ప్రపంచం ఒక్కటే... దాన్ని మనం చూసే దృక్కోణాన్ని బట్టి మన ప్రపంచం అవుతుంది. ఇంద్రియాలు అందించే సమాచారాన్ని బట్టి మెదడు స్పందించే తరహాను బట్టి “మనసు" యొక్క స్వరూపం ఏర్పడుతుంది. ఆధునిక కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంటిది. మెదడు మన శరీర ఇంద్రియాలలో సన్నిహితంగా వుండి వాటి చేత పనిచేయిస్తూ, ఆదేశాలిస్తూ మనుగడ సాగేలా చేస్తుంది మనసు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని చూసేది మన మనసు. మానసిక శక్తి: ఆహారం భుజించటం ద్వారా మనం శక్తిని పొందుతాం. ఈ శక్తిమూలంగా రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, నరాల సమాచార వ్యవస్థ, కండరాల చర్యలు.. వగైరా వగైరా పని చేస్తూ వుంటాయి. శక్తి అనేక రూపాల్లో వుంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. సైకిలు తొక్కేటపుడు మన శారీరక శక్తి యాంత్రికశక్తిగా మార్చటం జరుగుతుంది. అలాగే ఉష్ణశక్తి, విద్యుచ్ఛక్తి, రసాయనిక శక్తి వగైరా వగైరా.. మనిషి తన వక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు మూడు విధాలుగా పనిచేసే శక్తినే మానసిక శక్తి లేదా సైకిల్ పవర్ అంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించటం, ఆలోచించటం,గుర్తుంచుకోవటం పనులకు ఈ సైకిల్ పవర్ అత్యవసరం. . మనసు 'గతి' ఏమిటో.. మనసు గతి' ఇంతేనని వాపోయిన మహాకవి మనసులేని బతుకొక నరకం అనికూడా అన్నాడు. శరీరం మనసు వేర్వేరు కావు. శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయ్. శరీరానికి వచ్చే వ్యాధులకు మందులెంత అవసరమో, మనసుకు కలిగే వ్యాధులకు బాధలకు వైద్యం కూడా అంతే అవసరం. గతులు తప్పే మనసును గ్రహించి, అంతరంగ శృతులను సరిచేసుకోవాలంటే భావోద్వేగాలకు ఆలవాలమైన మానసిక స్వభావ స్వరూపాలను అర్ధం చేసుకోవాలి. కంటికి కనిపించకుండా జీవితమనే మహానాటకాన్ని నడిపించే ప్రధాన సూత్రధారి మనసు. ఇది మనచేత మంచి చేయిస్తుంది. చెడూ చేయిస్తుంది. మన ఖ్యాతికి, అపఖ్యాతికి మూలమైంది ఇదే. ‘ శారీరక లక్షణాలు... - గుండె వేగంగా కొట్టుకోవడం. బీపీ పెరుగడం, తగ్గడం. - ఊపిరి అధికంగా తీసుకోవడం - చేతులు కాళ్ళు వణుకటం - ఎక్కువగా చెమటలు పట్టడం. - మోషన్ కి, యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్లడం. గొంతులో తడి ఆరిపోవడం. - కండరాలు బిగుసుకుపోవడం, ఛాతీలోనో, మెడలోనో నొప్పి రావడం. తలనొప్పులు శారీరక లక్షణాలు కనపడేటప్పటికి, మనసులో ఇంకా గాభరా పెరిగిపోతుంది. - మనసులో గాభరా పెరిగేటప్పటికి, శారీరక లక్షణాలు ఇంకా పెరుగుతాయి. మానసిక లక్షణాలు... - అకారణంగా భయం, ఆందోళన, కంగారు, గాభరా, నిరాశ, ఆకలి ఎక్కువ లేదా తక్కువ వుండటం, మనసు ఏదో కీడు శంకిస్తోందన్నట్టుగా ఉండటం,చెడు ఆలోచనలు, ఏదో అయిపోతుందనే భయం, - మనసు స్థిమితంగా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం. - జ్ఞాపకశక్తి సన్నగిల్లటం, గ్రహించలేక పోవటం, మెదడులో ఉన్న సరుకును బయటికి తీయడానికి కూడా కష్టంగానే ఉంటుంది. - నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ పట్టినా గంట గంట కి మెలకువ వచ్చేస్తుంది. ఏదో పీడకలలు, అర్థం పర్థం లేని కలలుతో ఉదయం లేచేటప్పటికి, రాత్రి విశ్రాంతి తీసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు. రాత్రంతా కూడా బ్రెయిన్ ఓవర్ వర్క్ చేసినట్టే ఉంటుంది. మనసు కోతి లాంటిది!’ మాన్యులైనా, సామాన్యులైనా మనసు చెప్పినట్లు నడచుకోవాల్సిందే! అంటే మనం తీసుకునే ఆహారం ప్రభావం మనసుపైన పడుతుంది. అందుకే మనసుకు కళ్లెం వెయ్యాలి. దాన్ని నియంత్రించాలి. అదే మనోనిగ్రహం. మనసు లోతును తెలుసుకోలేం. మనోవేగాన్ని అందుకోలేం. అందుకే అది మనల్ని ఆడిస్తూంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఆహార పరిశుభ్రత కచ్చితంగా మనసును ప్రభావితం చేస్తుంది. బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలను తొలగిం చుకుని, మనో శుభ్రతను కూడా పాటించాలి. మనసంత వేగంగా ప్రయా ణించేది ఏదీ లేదు. దాని వేగానికి బుద్ధి కళ్లెం వేయగలదు. బుద్ధి మెదడునుంచే పుడుతుంది. మనసు బుద్ధి అదుపులో ఉన్నంతవరకు దుర్మార్గానికి పాల్పడదు. మనసుకు బుద్ధే తల్లి, తండ్రి, గురువు, దైవం... అన్నీ! మనిషి మనసే మిత్రుడిగాను, శత్రువుగానుపనిచేస్తుంది.స్వీయనియంత్రణకు అడ్డుపడే ఆలోచనలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. సానుకూల యోచనలు సంచరించే సాధనంగా మనసును మలచుకోవాలి. సేవచేయడం, వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, పొరపాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తిశిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవి గ్రహించిన మనిషి మనసు తామరాకు మీద నీటి బొట్టవుతుంది. స్వచ్ఛమైన స్ఫటికమవుతుంది. సానపట్టిన వజ్రమవుతుంది. ఇదంతా మనసుకు వేసే కళ్లెంమీదనే ఆధారపడి ఉంది.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్@9390044031/40





Super.