YOU ARE YOUR OWN COMPETITION
- Mind and Personality Care

- Apr 20, 2022
- 2 min read
చదువు - పరీక్షలు - విజయం
జీవితంలో ప్రతి అడుగు ముందుకే వేయాలనే జిజ్ఞాస, తపన మీలో వుంటుంది.
చేపట్టిన ప్రతి రంగంలోనూ, అగ్రశ్రేణిలో నిలబడాలనే ఆకాంక్ష, వేడిగా, వాడిగా వుండే దశ యువతది. కాలేజి ఎన్నికల్లో నిలబడి గెలవాలని, క్రికెట్ టోర్నమెంట్ కప్పు గెలుచుకోవాలని, IAS అవ్వాలని, కమీషనర్ ఆఫ్ పోలీస్ గా మారాలని, వలచిన ప్రియురాలి/ప్రియుని ప్రేమను గెలుచుకోవాలని ఇలా యువత కోరికలు అనేకం ఆకాంక్షలు అపరిమితం. అయితే యువత ఎదురుగా కన్పించే ఒక పెద్ద అడ్డు గోడ "కాంపిటీషన్”. మీ అందరికీ తెలియని ఒక స్టన్నింగ్ నిజంచెప్పనా....?
మీకు మీరే పోటి
ఈ నిజాన్ని మనసా, వాచా, కర్మణా గ్రహించండి. మైండ్ పవర్ ని మేలుకొలపడానికి అదే తొలిమెట్టు. మీకు బయటనుంచి ఎటువంటి కాంపిటీషన్ లేదు. మీరు స్వయంగా నిర్మించుకున్న అవధుల కారణంగానే మీరు అనుకుంటున్న “పోటీ” అనే వస్తువు తయారైంది.
అద్దంలో చూసుకుంటే గానీ ఎవరి ముఖం వారికి కనబడదు. మీరు మీ కనులు సారించి మీ ఫ్రెండ్స్ ని, లోకాన్ని చూస్తారే తప్ప, మిమ్మల్ని మీరు చూసుకోరు. మిగిలిన వాళ్ళంతా చేసే పనుల్ని చూస్తారే తప్ప, మీరు చేస్తున్న పనేమిటో, పొందుతున్న శిక్షణ ఏమిటో గమనించరు.
విజేతలకు మాత్రమే తెలుసు, ఇది ఒక అంతర్గత క్రీడ (గేమ్) అని. తమ ఆత్మౌన్నత్య భావాలు, క్రమశిక్షణ, భవిష్యదర్శనం మొదలైన అంశాలు మాత్రమే తమ ఫెర్ఫార్మెన్స్ ను నిర్ధారిస్తాయని తెలుసు వారికి. మైండ్ పవర్ ను గురించి తెలుసుకోవటమే ప్రధానమైన ఆయుధం. దీనిని మేల్కొలపటానికి కావల్సిన పనిముట్టును అవగాహన చేసుకుంటే, ఎక్కడవున్నా, ఎలా వున్నా సక్సెస్ సుసాధ్యమవుతుందని విజేతలు గ్రహిస్తారు. భిన్న రకాల సవాళ్ళను ఎదుర్కొనటమే సోపానాలు వారికి. "Chance favours the prepared mind" అన్నాడు లూయిస్ పాశ్చర్.
సంసిద్ధతను కల్గి వున్న వారిని మాత్రమే “ఛాన్స్” వరిస్తుంది. విజయం అదృష్టం ఇవి లక్ష్మిదేవి స్వరూపాలు కావు. యోగ్యత కల్గిన ఏ కొద్దిమంది ఇంటి తలుపులను మాత్రమే ఇవి తట్టవు. వాటిని అందుకోటానికి "సిద్ధంగా” వున్నవారినే అవి వరిస్తాయి. ఇక్కడ సిద్ధంగా వుండటం
అనే పదాన్ని బాగా అర్ధం చేసుకోండి. ఏం మేం సిద్ధంగాలేమా We are quiet ready to win అని అనకండి. సిద్ధంగా వుండటం అంటే.... శిక్షణ పొంది వుండటం. అర్నాల్డ్ స్వావర్డ్నెగర్ తన జీవిత గాధలో ఇలా రాసుకున్నాడు. (The education of a body builder - Arnold, Pocket books, 1982) "మైండ్ ఒక డైనమో లాంటిది. అది అత్యంత శక్తిమంతమైన సాధనం. ఆ శక్తిని నెగెటివ్ గా వుపయోగించి “మీకు” వ్యతిరేకంగా భ్రష్టత్వం పొందటానికి
ఉపయోగించుకోవచ్చు. లేదా మిమ్మల్ని వెనకనుండి ముందుకు తోసి మీలో అనుక్షణం రగిలే ఆకాంక్షలను నిజం చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు."
మీలో రగిలే ఆకాంక్షలను గురించి ఒక్కసారి ఆలోచించండి. మీలో అసంతృప్తి
ప్రబలిపోవటానికి మీరు మీలో రగిలే ఆకాంక్షలు నెరవేరకపోవటమే అని మీకు ఏనాడూ
అన్పించలేదా...? “నేను ఫలానా విధంగా వుంటేనా...?” అని అన్పించలేదా..
1. నాకే గనుక అదృష్టం వుంటేనా....?
2. నాకే గనుక ఆత్మవిశ్వాసం దండిగా వుంటేనా...?
3. నాకే గనుక మంచి మార్కులు వస్తేనా...?
4. నాకే గనుక క్రికెట్ ఆడటం వస్తేనా...?
5. నాకే గనుక పేరు ప్రఖ్యాతలు వుంటేనా...?
6. నాకే గనుక మా అమ్మానాన్నలతో మంచి సంబంధాలు వుంటేనా...?
7. నాకే గనుక నా దురలవాట్లను వదిలించుకునే శక్తి వుంటేనా...?
8. నాకే గనుక అందరినీ ఇట్టే పసిగట్టే గుణం వుంటేనా...?
ప్రతివ్యక్తి తన జీవితంలోంచి ఎక్కువ పొందటానికే ఆశిస్తాడు. విద్యార్ధులకే కాదు....అందరికీ. ప్రస్తుతం తాము వున్న... వుంటున్న స్థితి గతులను మెరుగైన జీవితాన్నే పొందాలని కాంక్షిస్తారు. గడియారం స్ప్రింగులా పొటెన్షియాలిటీనంతటినీ అంటి పెట్టుకుని వుండే యువత గుండెల్లో ఈ ఆకాంక్ష ఎంత దృఢంగా వుంటుందో గమనించండి. మీరు మీ తోటి వారందరిలోకి టాపర్‌గా నిలబడటం ఎంత గాఢమైన, ఉత్కంఠభరితమైన ఆలోచనో గమనించండి. ఒక కంప్యూటర్ కన్నా ఎన్నో రెట్లు శక్తి మీలో దాగి వుందన్న సంగతి ఊహించుకోండి. మీ శరీరం ఎలా పరవశంతో కదిలిపోతుందో. ఆత్మ విశ్వాసం మీ గుండెల నిండా బలంగా నాటుకుపోయినట్లుగా ఊహించుకోండి. అది ఎంత అచంచలంగా స్థిరపడ్తుందో గమనించండి. గతంలో మీరు, అనేకసార్లు పరీక్షలు రాశారు. చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. కొన్నిసార్లు అతిసులభంగా
పరీక్ష పాసయ్యారు. మరికొన్నిసార్లు అనేక సవాళ్ళ మధ్య అవుట్ స్టాండింగ్ మార్కులు సాధించారు. మీరు గుర్తుంచుకోవల్సింది మీ అపజయాలను కాదు. సులువుగా సాధించేసిన విజయాలను కాదు. సవాళ్ళను ఎదుర్కొంటూ విజయాన్ని సాధించిన సంఘటనలను సదా మననం చేసుకోండి.అనుభవాలే మీకు ఇపుడు పనికొస్తాయి. మీలో ఆత్మ విశ్వాసాన్ని ఊరింపచేస్తాయి.
డా.హిప్నో పద్మా కమలాకర్,
సైకో థెరపిస్ట్ ,హిప్నో థెరపిస్ట్
@9390044031/40



Comments